తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అక్టోబర్ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించడమే లక్ష్యం
ప్రస్తుతం తిరుమలలో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అయినప్పటికీ, అదే రోజు అదనంగా వచ్చే దాదాపు 30 వేల మంది భక్తులు మరుసటి రోజు దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సాధారణ భక్తుల నిరీక్షణ సమయం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
సిఫార్సు లేఖల స్వీకరణ కూడా నిలిపివేత
బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు ముందు రోజుల్లోనూ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
- సెప్టెంబరు 30, బుధవారం: అక్టోబర్ 1 దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు స్వీకరించరు.
- అక్టోబర్ 4, ఆదివారం: అక్టోబర్ 5 దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలు స్వీకరించరు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
