ఆధ్యాత్మిక భావనతోనో లేదా ఫ్యాషన్ కోసమో చాలామంది మెడలో దేవతామూర్తుల చిత్రాలు, విగ్రహాల రూపాలు చెక్కిన లాకెట్లను ధరిస్తుంటారు. శివుడు, వినాయకుడు, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణుడు లేదా ఇష్టదైవాల చిత్రాలతో కూడిన లాకెట్లను వేసుకోవడం నేడు సర్వసాధారణమైంది. అయితే, దైవ స్వరూపాలున్న లాకెట్లను మెడలో ధరించడం శాస్త్రోక్తంగా సబబేనా..? దీనిపై ధర్మశాస్త్రాలు, పండితులు చెబుతున్న నియమాలు ఏమిటి..?
పవిత్రత, నిష్ట తప్పనిసరి..!
హిందూ సంప్రదాయంలో దేవతా రూపాలను అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. పూజా మందిరాల్లోని దేవుడి పటాలకు నిత్యం శుచి, శుభ్రతలతో దీపారాధన చేస్తాం. కానీ, నిత్య జీవితంలో మనిషి నిద్రించే వేళ, భోజనం చేసే సమయాల్లో, మలమూత్ర విసర్జన వంటి అశౌచ సమయాల్లో శరీర పవిత్రతను నిరంతరం కాపాడుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వేళల్లో దైవ స్వరూపాలు ఒంటికి తగలడం లేదా అపవిత్రతకు గురికావడం వల్ల దోషం కలుగుతుందని ధర్మశాస్త్ర పండితులు చెబుతున్నారు. అందుకే సాక్షాత్తూ భగవంతుడి ముఖారవిందం ఉన్న లాకెట్లను ధరించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
విరిగిపోతే దోషం.. అగౌరవానికి తావు లేకుండా..
రోజూ పనులు చేసుకునేటప్పుడు లేదా నిద్రించే సమయంలో దుస్తులు తగిలి లాకెట్లు వంగిపోవడం, గీతలు పడటం లేదా విరిగిపోవడం జరుగుతుంటుంది. విగ్రహం లేదా దైవ రూపం ఖండితమైతే (విరిగిపోతే) అది అశుభానికి సంకేతంగా భావిస్తారు. సాధారణ ఆభరణం పాడైతే సరిచేయించుకోవచ్చు కానీ, ఖండితమైన దైవ ప్రతిమలను మెడలో ఉంచుకోవడం శాస్త్రసమ్మతం కాదు. వాటిని నదుల్లో లేదా చెట్ల మొదట్లో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.
దైవ ప్రతిమలకు బదులుగా ఏం ధరించవచ్చు?
భగవంతుని కృప, రక్షణ ఉండాలని కోరుకునేవారు రూపాలు ఉన్న లాకెట్లకు బదులుగా పవిత్రమైన చిహ్నాలను ధరించడం ఎంతో శ్రేయస్కరం.
ఓంకారం (ॐ).. సృష్టి ఆది ప్రణవ నాదమైన 'ఓం' లాకెట్‌ను ధరించడం సర్వశుభప్రదం. ఇది మనసుకు ప్రశాంతతను, సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. స్వస్తిక్, త్రిశూలం లేదా శంఖు-చక్రాలు..సానుకూల శక్తినిచ్చే మంగళకరమైన చిహ్నాలను ఎంచుకోవచ్చు.
రుద్రాక్ష లేదా తులసి మాల..శాస్త్ర నియమాల ప్రకారం నియమిత ముఖాలు కలిగిన రుద్రాక్షను గానీ, తులసి పూసల మాలను గానీ మెడలో ధరించడం విశేష ఫలితాలను ఇస్తుంది.
యంత్రాలు - జ్యోతిష్య రత్నాలు..జాతక చక్రం, గ్రహ దోష నివారణ కోసం నిపుణులైన జ్యోతిష్యుల సలహాతో సంబంధిత యంత్రాలను (తావీజు రూపంలో) లేదా ఉంగరాలు, లాకెట్లలో రత్నాలను ధరించవచ్చు.
భక్తి అనేది బాహ్య అలంకరణ కంటే అంతఃకరణ శుద్ధిలోనే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భగవంతుడి లాకెట్లను ధరించాలనుకుంటే వాటి పవిత్రతకు భంగం కలగకుండా నిష్టగా ఉండగలగాలి. ఆ నిబంధనలు పాటించలేన ప్పుడు ప్రతీకాత్మకమైన చిహ్నాలను లేదా రుద్రాక్షలను ధరించడమే ఉత్తమ మార్గం.
