ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన, పవిత్రమైన ప్రదేశం. కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యమనే అమృతాన్ని అందించేది ఇక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదికి అగ్ని తత్వంతో కచ్చితమైన అనుసంధానం ఉంటుంది. అందుకే అక్కడ వస్తువులను సరైన పద్ధతిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిచెన్ స్లాబ్‌పై కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ వస్తువులను దీర్ఘకాలం పాటు అక్కడే ఉంచితే ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఇంతకీ కిచెన్ స్లాబ్‌పై ఉంచకూడని ఆ వస్తువులు ఏమిటో, వాటిని ఎందుకు దూరంగా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పగిలిన లేదా బీటలు వారిన పాత్రలు..
వంటగదిలో కప్పులు, ప్లేట్లు లేదా ఇతర పాత్రలు పగిలినా, బీటలు వారినా వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలి. వాటిని భద్రపరచడం వాస్తు ప్రకారం దోషం. ముఖ్యంగా పగిలిన వస్తువులు కిచెన్ స్లాబ్‌పై ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. వీటిని ఆర్థిక ఇబ్బందులు, అనవసరపు ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కారణాలుగా నమ్ముతారు. అంతేకాకుండా, పగిలిన పాత్రల వల్ల చేతులకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వాటిని వదిలించుకోవడమే ఉత్తమం.
మందులు, మాత్రలు..
చాలామందికి రోజూ వేసుకునే మందులను సులభంగా గుర్తుండాలని కిచెన్ స్లాబ్‌పై లేదా వంటగదిలో ఉంచే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. వంటగది అనేది ఆరోగ్యాన్ని, పోషణను ఇచ్చే ప్రదేశం. దానికి అనారోగ్యాన్ని సూచించే మందులతో సంబంధం ఉండకూడదు. ఈ రెండు భిన్నమైన శక్తులు కలవడం వల్ల ఇంట్లో ఆరోగ్యపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతారు. కాబట్టి, మందులను ఎప్పుడూ కిచెన్‌కు దూరంగా, వాటికి నిర్దేశించిన సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోవాలి.
మురికి బట్టలు, శుభ్రం చేసే వస్తువులు..
కిచెన్ స్లాబ్‌పై ఎప్పుడూ మురికి బట్టలు, గిన్నెలు తోమే బ్రష్‌లు, స్పాంజ్‌లు లేదా చీపురు లాంటి వస్తువులు ఉంచకూడదు. వంటగదిలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అన్నం వండే ప్రదేశం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. స్లాబ్‌పై ఇలాంటి అపరిశుభ్రమైన వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని, కుటుంబ పురోభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఇవి వంట చేసే ప్రదేశంలో ఉంటే రోగకారక క్రిములు చేరే ప్రమాదం ఉంది.
కిచెన్ స్లాబ్‌ను ఎలా ఉంచుకోవాలి..?
కిచెన్ స్లాబ్‌పై కేవలం రోజూ వంటకు అవసరమయ్యే ముఖ్యమైన వస్తువులను మాత్రమే ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులతో నింపేయకూడదు. స్టౌవ్, స్లాబ్ చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వంటగది ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా, ఎంత క్రమపద్ధతిలో అమర్చి ఉంటే.. ఆ ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు అంతగా వెల్లివిరుస్తాయని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. దైవానుగ్రహం కూడా మెండుగా ఉంటుంది.
