సనాతన ధర్మంలో 'దానం' అనే మాటకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చేతనైనంతలో ఇతరులకు సాయం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే, మనకు తోచింది, మన దగ్గర ఉన్నది అవతలి వారికి ఇచ్చేయడమే దానం అని చాలామంది భావిస్తుంటారు. కానీ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దానానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా 'గరుడ పురాణం' ప్రకారం కొన్ని వస్తువులను అసలు దానం చేయకూడదు. ఒకవేళ తెలియక చేసినా అది పుణ్యానికి బదులు పాపాన్ని, ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇంతకీ గరుడ పురాణంలో చెప్పబడిన ఆ దాన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
మహా పుణ్య ఫలాన్నిచ్చే 'దశ దానాలు'..
గరుడ పురాణంలోని ఆచార ఖండంలో మానవుడికి మోక్షాన్ని, సద్గతులను ప్రసాదించే పది రకాల ఉత్తమ దానాల (దశ దానాలు) ప్రస్తావన ఉంది. సరైన వ్యక్తికి, సరైన సమయంలో వీటిని ఇవ్వడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
గోదానం.. దానాలన్నింటిలోకి ఆవును దానం చేయడం అత్యంత శ్రేష్ఠమైనది. ఆకలితో ఉన్న పేదవారికి, సదాచార సంపన్నులైన వారికి గోదానం చేయడం వల్ల మరణానంతరం వైతరిణీ నదిని సులభంగా దాటి మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు.
భూదానం.. నిలువనీడ లేని నిరుపేదలకు, ఆశ్రయం అవసరమైన వారికి నివాస స్థలాన్ని లేదా భూమిని దానం చేయడం వల్ల అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
తిల అంటే నువ్వులు.. దానం.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దోషాలు ఉన్నవారు, ఆత్మవిశ్వాసం కొరవడిన వారు నువ్వులను దానం చేయడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శివపురాణంలోనూ నువ్వుల దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.
బంగార, వెండి వస్తువుల దానాలు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి బంగారం దానం చేయడం వల్ల జాతకంలో సూర్య బలం పెరిగి, సంపద వృద్ధి చెందుతుంది. వెండిని దానం చేయడం వల్ల మానసిక కారకుడైన చంద్రుడు బలపడి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.
ధాన్య, లవణ దానాలు.. ఆకలితో అలమటించే వారికి అన్నం, ధాన్యాలు, నెయ్యి, బెల్లం,ఉప్పు దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి, ఆ ఇల్లు ఎల్లప్పుడూ ధాన్యంతో తులతూగుతుంది.
పొరపాటున కూడా వీటిని దానం చేయకండి..!
కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల పుణ్యానికి బదులు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని గరుడ పురాణం స్పష్టంగా నిషేధించింది.
పాపప్రదమైన దానాలు..
ఎంగిలి లేదా నిల్వ ఉన్న ఆహారం.. ఇంట్లో మిగిలిపోయిన పాడైపోయిన అన్నాన్ని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఎవరికైనా దానం చేయడం మహా పాపంగా పరిగణించబడుతుంది. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పించి, ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది.
పదునైన వస్తువులు.. కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన లేదా హింసకు కారణమయ్యే వస్తువులను ఇరుపొరుగు వారికి లేదా ఇతరులకు దానంగా ఇవ్వకూడదు. దీనివల్ల కుటుంబంలో ఒత్తిడి, మానసిక అశాంతి ఏర్పడతాయి.
మరణించిన వారి బట్టలు, అపవిత్ర వస్తువులు.. మరణించిన వ్యక్తి వ్యక్తిగతంగా ఉపయోగించిన బట్టలు లేదా వస్తువులను నేరుగా దానం చేయకూడదు. అలాగే చిరిగిన బట్టలు, అపవిత్రమైన లేదా విరిగిపోయిన వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
గరుడ పురాణం నిర్దేశించిన దాన నియమాలు..
దానం చేసేటప్పుడు వస్తువుతో పాటు దానం చేసే వ్యక్తి మనస్తత్వం కూడా ముఖ్యం. అందుకోసం శాస్త్రం కొన్ని సూత్రాలను నిర్దేశించింది.
దురుద్దేశం ఉండకూడదు..
అవతలి వ్యక్తికి కీడు చేయాలనే భావనతోనో, లేదా ఏదైనా స్వార్థ ప్రయోజనం ఆశించో దానం చేయకూడదు. అది కేవలం అవతలి వారి అవసరాన్ని తీర్చేదిగా మాత్రమే ఉండాలి.
చెత్తను వదిలించుకునే మార్గం కాదు..
మనకు పనికిరాని ఒక వ్యర్థ పదార్థాన్ని అవతలి వారిపై రుద్దడం దానం అనిపించుకోదు. మనకు ఉపయోగపడేదై ఉండి, అవతలి వారికి అత్యంత అవసరమైన సమయంలో ఇచ్చేదే నిజమైన విరాళం.
ఆర్థిక శక్తికి మించిచేయవద్దు..
తన కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తూ, అప్పులు చేసి లేదా ఇంట్లో వారిని ఏడిపించి దానధర్మాలు చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది. తమకు ఆర్థిక స్తోమత లేకపోతే వారికి తగినంతలోనే దానం చేయాలి..
దొంగిలించిన సొమ్ము చెల్లదు..
ఇతరుల నుంచి అక్రమంగా లాక్కున్న వస్తువులను గానీ, దొంగిలించిన సొమ్మును గానీ దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం రాకపోగా, తీవ్రమైన పాపం చుట్టుకుంటుంది.
నిజమైన దానం రహస్యంగా ఉండాలి..
లోకంలో గుర్తింపు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం పది మందికి తెలిసేలా చేసే దానాల వల్ల పెద్దగా ఫలితం ఉండదు. కుడిచేత్తో చేసే దానం ఎడమచేతికి తెలియకూడదన్న చందంగా రహస్యంగా చేసే దానానికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. కాబట్టి, ఇకపై దానధర్మాలు చేసేటప్పుడు ఈ ధార్మిక నియమాలను మనస్సులో ఉంచుకుని, శ్రద్ధతో చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు, దైవానుగ్రహం లభిస్తాయని గరుడ పురాణం స్పష్టం చేస్తోంది.
