హైందవ సనాతన ధర్మంలోనూ, వాస్తు శాస్త్రంలోనూ ఏనుగుకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. గజరాజును సాక్షాత్తూ విఘ్నేశ్వరుడి స్వరూపంగా, సిరిసంపదలను ప్రసాదించే గజలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో లేదా పూజా మందిరాల్లో ఏనుగు విగ్రహాలను ఉంచుకుంటారు.
అయితే, వాస్తు ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితేనే సత్ఫలితాలు అందుతాయి. తప్పుడు దిశలో ఉంచితే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..
ఏ దిశలో ఉంచితే శుభప్రదం..?
విగ్రహాన్ని ఉంచే దిశపైనే దాని సానుకూల ప్రభావం ఆధారపడి ఉంటుంది.
ఉత్తర దిశ..
వృత్తి, వ్యాపారాల్లో రాణించాలనుకునే వారు, కెరీర్ లో కొత్త అవకాశాల కోసం ఎదురుచూసేవారు ఏనుగు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం.
తూర్పు దిశ..
ఇంట్లో సానుకూల శక్తి (Positive Energy) పెరగాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతానురాగాలు వెల్లివిరియాలన్నా దీనిని తూర్పు దిశలో ప్రతిష్ఠించాలి.
ప్రధాన ద్వారం వద్ద..
ఇంటి గుమ్మం వద్ద ఒక జత ఏనుగు బొమ్మలను ఉంచే సంప్రదాయం అనాదిగా వస్తోంది. అయితే, ఆ రెండు ఏనుగులు ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా (స్వాగతం పలుకుతున్నట్లుగా) ఉంటే.. ఇంట్లోకి ధనలక్ష్మితో పాటు సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
విగ్రహం ఎలా ఉండాలి అంటే..?
వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. తొండం పైకి ఎత్తి ఉన్న ఏనుగు విగ్రహం అత్యంత శుభదాయకం. ఇది అదృష్టానికి, అఖండ విజయానికి, ప్రగతికి సంకేతం.
లోహం లేదా చెక్క.. ప్లాస్టిక్ కాకుండా ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసినవి గానీ.. లేదా రాయి, చెక్కతో చెక్కిన నాణ్యమైన విగ్రహాలను ఎంచుకోవడం ఉత్తమం.
జంట ఏనుగులు..ఒక జత ఏనుగులను పక్కపక్కనే ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడతాయి.
ఈ ప్రదేశాల్లో అస్సలు ఉంచకూడదు..!
వాస్తు శాస్త్రం ప్రకారం, మురికిగా ఉండే ప్రదేశాల్లో ఈ విగ్రహాలను ఉంచరాదు. బాత్రూమ్, టాయిలెట్ సమీపంలో లేదా మెట్ల కింద ఏనుగు విగ్రహాలను పొరపాటున కూడా ఉంచకూడదు.
పగిలిపోయిన లేదా ఎక్కడైనా దెబ్బతిన్న ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం వాస్తు దోషానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు విగ్రహం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఆధ్యాత్మిక విశిష్టత..
గజరాజు సిరిసంపదలకు, స్థిరత్వానికి మారుపేరు. లక్ష్మీదేవికి ఇరువైపులా ఉండే గజాలు అష్టైశ్వర్యాలను సూచిస్తాయి. ఈ వాస్తు నియమాలను పాటిస్తూ, సరైన దిశలో ఏనుగు విగ్రహాన్ని ఉంచితే ఇంటా బయటా శుభాలు కలుగుతాయని, కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
