సనాతన ధర్మంలో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. పవిత్రమైన ఈ పన్నెండు శైవ క్షేత్రాలను దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 'జ్యోతిర్లింగం' అనగా 'శివుని దివ్య కాంతి'. ఈ పుణ్యక్షేత్రాలలో పరమశివుడు స్వయంగా కాంతి స్తంభం రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
బ్రహ్మ, విష్ణువుల మధ్య 'తమలో ఎవరు గొప్ప..?'
శివపురాణం ప్రకారం.. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య 'తమలో ఎవరు గొప్ప..?' అనే వివాదం తలెత్తింది. వారి సందేహాన్ని నివృత్తి చేసేందుకు పరమశివుడు అంతూ దరీ లేని ఒక అనంతమైన అగ్ని స్తంభం జ్యోతి రూపంలో అవతరించాడు. ఆ స్తంభం మొదలును కనుగొనేందుకు శ్రీ మహావిష్ణువు పాతాళానికి, అగ్రభాగాన్ని చూసేందుకు బ్రహ్మదేవుడు పైకి ప్రయాణించారు. కానీ ఇరువురూ ఆ జ్యోతి ఆది, అంతాలను కనుగొనలేకపోయారు. ఆ సమయంలో శివుని దివ్య కాంతి భూమిపై ఎక్కడెక్కడైతే ప్రసరించిందో.. అవే జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాయి.
భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు..
ఈ క్షేత్రాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు, అద్భుతమైన వాస్తుశిల్ప కళకు, దివ్య శక్తికి నిలయాలు. దేశవ్యాప్తంగా ఉన్న ఆ 12 జ్యోతిర్లింగాలు ఇవే..
సోమనాథ్ (గుజరాత్)..దేశంలోనే వెలసిన మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం.
మల్లికార్జున స్వామి (ఆంధ్రప్రదేశ్)..నల్లమల అడవుల్లోని శ్రీశైలగిరులపై కొలువైన పవిత్ర క్షేత్రం.
మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్)..పుణ్యనగరి ఉజ్జయినిలో వెలసిన స్వయంభూ లింగం.
ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్): పవిత్ర నర్మదా నదీ తీరంలో ప్రణవాకారంలో ఉన్న శివయ్య.
కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్)..మంచుదుప్పటి కప్పుకున్న హిమాలయ సానువుల్లోని దివ్యక్షేత్రం.
భీమశంకర్ (మహారాష్ట్ర)..పచ్చని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొలువైన మహారుద్రుడు.
కాశీ విశ్వనాథ్ (ఉత్తరప్రదేశ్)..ముక్తిదాయకమైన వారణాసి (కాశీ)లో వెలసిన విశ్వేశ్వరుడు.
త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర)..పవిత్ర గోదావరి నది జన్మస్థానం వద్ద ఉన్న అద్భుత క్షేత్రం.
వైద్యనాథ్ (జార్ఖండ్)..భక్తుల కోరికలు తీర్చే 'మనోకామనా లింగం'గా ప్రసిద్ధి.
నాగేశ్వర్ (గుజరాత్)..చారిత్రక ద్వారకకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం.
రామేశ్వరం (తమిళనాడు)..సాక్షాత్తూ శ్రీరామచంద్రుడిచే ప్రతిష్ఠించిన పవిత్ర శివలింగం.
ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర)..ఔరంగాబాద్ సమీపంలో ఉన్న చిట్టచివరి జ్యోతిర్లింగం.
ఈ క్షేత్రాల దర్శనం ఎందుకంత ప్రత్యేకం..?
ద్వాదశ జ్యోతిర్లింగాల వైభవం కేవలం ఆలయాలకే పరిమితం కాదు. ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ దాగి ఉంది. ఇవి చెడుపై మంచి సాధించిన విజయానికి, అపారమైన భక్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ఈ క్షేత్రాలలో విశ్వశక్తి (Cosmic Energy) అత్యధికంగా ప్రవహిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. కాబట్టే ఇవి ధ్యానం, తపస్సు, ఆత్మసాక్షాత్కారం పొందేందుకు అత్యంత అనువైన ప్రదేశాలుగా విరాజిల్లుతున్నాయి. ఒక్కసారి ఈ క్షేత్రాలను దర్శిస్తే.. మనసులోని కల్మషం తొలగిపోయి అనిర్వచనీయమైన ప్రశాంతత లభిస్తుంది.
