సనాతన ధర్మంలో పితృదేవతలకు అర్పించే తర్పణాలకు, శ్రాద్ధ విధులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మరణించిన తమ పూర్వీకుల ఆత్మకు సద్గతులు కలగాలని, ప్రతిఏటా వచ్చే తిథుల నాడు పిండప్రదానం చేయడం హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం.
అయితే, సమాజంలో కాలక్రమేణా ఒక బలమైన నమ్మకం ఏర్పడింది—పితృ కర్మలు కేవలం కుమారులు మాత్రమే చేయాలని, కుమార్తెలకు ఆ అర్హత లేదని చాలామంది భావిస్తుంటారు. ఒకవేళ కేవలం కుమార్తెలు మాత్రమే ఉన్న కుటుంబాల్లో ఈ బాధ్యత ఎవరిది..? కుమార్తెలు తండ్రికి లేదా తల్లికి శ్రాద్ధం పెడితే పితృదేవతలు అంగీకరిస్తారా..? గరుడ పురాణంతో పాటు ధర్మశాస్త్రాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శాస్త్రం ఏం చెబుతోంది అంటే..?
సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలకు భిన్నంగా, హిందూ ధర్మశాస్త్రాలు కానీ, గరుడ పురాణం కానీ కుమార్తెలు పితృ కర్మలు చేయడాన్ని పూర్తిగా నిషేధించలేదు. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తికి పుత్ర సంతానం లేని పక్షంలో, ఆ కుటుంబంలోని స్త్రీలు (భార్య, కోడలు, లేదా జ్యేష్ఠ కుమార్తె) పితృ కర్మలు, పిండప్రదానం నిర్వహించే పూర్తి అర్హతను కలిగి ఉంటారు.
ధర్మశాస్త్రాల ప్రకారం పితృ కర్మలు నిర్వహించడానికి ఒక నిర్దిష్ట ప్రాధాన్యతా క్రమం (Order of Precedence) ఉంది:
సొంత కుమారుడు అంటే జ్యేష్ఠ పుత్రుడు..
మనుమడు అంటే కుమారుడి కుమారుడు..
దత్తపుత్రుడు..
దౌహిత్రుడు అంటే కుమార్తె కుమారుడు-మనవడు..
భార్య లేదా కుమార్తె..
సోదరుడు లేదా సోదరుడి కుమారులు..
కాబట్టి, మగ సంతానం లేనప్పుడు కుమార్తెలు శ్రాద్ధం పెడితే పూర్వీకుల ఆత్మ తృప్తి చెందదని అనుకోవడం ముమ్మాటికీ అపోహే. శాస్త్ర నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో చేసే ఏ కర్మ అయినా ఆమోదయోగ్యమే అవుతుంది. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఒక పురోహితుడి ద్వారా కూడా పితృ కర్మలను పూర్తి చేయించవచ్చు.
రామాయణంలోని చారిత్రాత్మక సాక్ష్యం..
స్త్రీలు పిండప్రదానం చేయవచ్చనే విషయానికి వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం నిదర్శనంగా కనిపిస్తుంది. వనవాస సమయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి గయా క్షేత్రానికి చేరుకున్నప్పుడు, రాముడు శ్రాద్ధ సామగ్రి కోసం నగరంలోకి వెళ్తాడు. ఆ సమయంలో పితృదేవతల పిండప్రదాన కాలం ముగిసిపోతుండటంతో, దశరథ మహారాజు ఆత్మ స్వయంగా సీతాదేవికి దర్శనమిచ్చి పిండం అడుగుతుంది.
సీతాదేవి పిండప్రదానం..
సమయ భావాన్ని గ్రహించిన సీతాదేవి.. ఫల్గు నది, వటవృక్షం అంటే మర్రిచెట్టు, కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, ఆవులను సాక్ష్యాలుగా పెట్టుకుని, ఇసుకతో పిండాలను చేసి మామగారైన దశరథుడికి సమర్పిస్తుంది. ఆ పిండప్రదానాన్ని స్వీకరించిన దశరథుని ఆత్మ సంపూర్ణ తృప్తి చెంది, సీతాదేవిని ఆశీర్వదించి వెళ్తుంది.
ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా స్త్రీలకు కూడా పితృ కర్మల్లో భాగస్వామ్యం అయ్యే అర్హత, హక్కు ఉన్నాయని స్పష్టమవుతోంది.
శ్రాద్ధ కర్మలు అసలు ఎందుకు ముఖ్యం..?
గరుడ పురాణం ప్రకారం, మరణించిన ఏ వ్యక్తికైనా అంతిమ సంస్కారాలు, శ్రాద్ధ కర్మలు తప్పనిసరి. పితృ పక్ష కాలంలో పూర్వీకుల ఆత్మలు భూలోకానికి వస్తాయని, తమ వంశస్థులు ఇచ్చే తర్పణాలు, అన్నాన్ని స్వీకరించి ఆకలిదప్పులు తీర్చుకుంటాయని విశ్వాసం.
పితృ దోషం..ఒకవేళ వారసులెవరూ శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే, ఆ ఆత్మలు తృప్తి చెందక ఆకలితో అలమటిస్తాయి. దీనివల్ల ఆ కుటుంబంలో 'పితృ దోషం' ఏర్పడి, సంతాన లేమి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని గరుడ పురాణం హెచ్చరిస్తోంది.
ముక్తి మార్గం..సరైన నియమ నిబంధనలతో, భక్తి శ్రద్ధలతో (శ్రాద్ధం అంటేనే శ్రద్ధతో కూడినది) ఎవరు కర్మలు నిర్వహించినా, ఆ పూర్వీకులకు ప్రేత లోకం నుంచి ముక్తి లభించి పితృ లోకాలకు చేరుకుంటారు.
సనాతన ధర్మం ప్రకారం, కర్మలు ఎవరు చేశారు అనేదానికంటే.. ఎంత భక్తితో, శాస్త్రోక్తంగా చేశారు అనేదే ముఖ్యం. కాబట్టి కుమారులు లేని పక్షంలో కుమార్తెలు నిశ్చింతగా తమ తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలను నిర్వహించి, వారి రుణం తీర్చుకోవచ్చు.
